**నా రైలు ప్రయాణ అనుభవం**

 నేను గుంటూరు నుండి హైదరాబాద్ వెళదామని రైలు టికెట్ రిజర్వేషన్ చేయించుకొని రైల్వే స్టేషన్ లో పావుగంట ఎదురు చూసాక రైలు వచ్చింది.  లోపలకి వెళ్లి సీట్ చెక్ చేసుకొని కూర్చొన్నాను.  వేసవి కాలం అవటం తో సరిపడా గాలి లేక చమట తో   చాలా ఇబ్బందిగా అనిపించింది. కొంతదూరం ప్రయాణించాక, లేచి తలుపు దగ్గర కాసేపు నిలబడదాం అని వెళ్ళాను.  అక్కడ రిజర్వేషన్ లేని వాళ్ళు చాలా మందే నించోని ఉన్నారు ఇరుకుగా.   అప్పుడు నా చూపు ఆ ఇరుకులో ఉన్న నడి వయసు జంట (మొగుడు పెళ్ళాం) ఆకర్షించింది.  వాళ్ళు చూడటానికి పల్లెటూరు వాళ్ళ లా ఉన్నారు (వాళ్ళు మాట్లాడుకోవటం విని నాకు అర్థం అయింది). సీట్ దొరక లేదనుకుంటా తలుపు దగ్గర నిలబడి ఉన్నారు, చాలా ఇబ్బందిగా....

ఇంతలో రైలు లో తినుబండారాలు అమ్మే అతను వచ్చాడు! అతను హిందీ వాడు, వీళ్ళకేమో హిందీ రాదు, అతనికేమో తెలుగు రాదు. చివరికి ఏమీ కొనలేదు (భాష తెలియక పోవటం వల్ల). నేను కల్పించుకొని అర్థం చెప్పే లోపే అమ్మే అతను వెళ్ళిపోయాడు చిరాకుగా. వారిద్దరి మధ్య సంభాషణ సరదాగా అనిపించింది.

కొంచెం సేపు తర్వాత ఇద్దరు కింద కూర్చుందామని అనుకున్నారు, మెల్లగా తలుపు దగ్గర సర్దుకొని కూర్చొన్నారు.  కూర్చోటానికి చాలా మొహమాటంగా ఇబ్బంది పడుతూనే కూర్చొన్నారు.

 

సుమారు ఒక అర గంట గడిచాక, ఆమే అతనిని తినడానికి పెట్టనా అని అడిగింది, అతను సరే అన్నాడు.  ఆ ఇరుకులో, ఆ తలుపు దగ్గర, ఏ మాత్రం సంకోచం లేకుండా వాళ్ళు తెచ్చుకున్న సంచి లో నుండి ఒక డబ్బా లో ఉన్న పులిహోర తీసి ప్లేట్ లో పెట్టి అతనికి ఇచ్చింది.  అతను తినాలా వద్దా అని సందేహిస్తూనే తినటం మొదలు పెట్టాడు.  మధ్యలో ఆమె కొన్ని వడియాలు ఇంకొన్ని మిరపకాయలు అందించింది అతనికి నంచుకోటానికి.

 

ఆమే కొసరి కొసరి పెట్టింది అతనికి.  ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏమంటే, వాళ్ళు ఉన్న పరిస్థితి పట్టించుకోకుండా, అతనికి కడుపు నిండా తినిపించింది.  ఆ తర్వాత తాను అదే ప్లేట్ లో ముగించింది. ఇంతవరకు నాకు వాళ్ళ అనురాగం కనిపించింది. 

 

తిన్నాక ఇద్దరు తలుపు దగ్గరకు జరిగి, కాళ్లు బయట కు పెట్టి కూర్చొన్నారు.  ఒకరికి ఒకరు ముచ్చట్లు చెప్పటం మొదలుపెట్టారు.  వాళ్లకి ఎటువంటి బిడియం లేదు, ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.  వాళ్ళు కబుర్లు చెప్పుకుంటా, ఈ ప్రపంచాన్ని మరిచిపోయారు.  ఆ తర్వాత గమనించాను వాళ్ళు మొబైల్ లో "రోజా" సినిమా పాటలు (ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం) చిన్న వాల్యూం లో పెట్టుకొని వింటూ సరదాగా బయటకు చూస్తూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.  అది కదా ఆనందంగా జీవించటం అంటే అనిపించింది నాకు ఆ సమయం లో…..

 

నేను వాళ్ళని గమనిస్తూ, నాకు సీట్ రిజర్వ్ అయిన సంగతి మర్చిపోయి, సుమారు రెండు గంటలు నిలబడే ప్రయాణం చేశాను.

 

పక్కన నిలబడి ఉన్న కుర్రవాళ్లు, వాళ్లని చూసి "Made for Each Other " అని కామెంట్ కూడా చేసారు. అంటే వాళ్ళు అందరి చూపు ఆకర్షించారు.

 

వారి అమాయకత్వం, ఆప్యాయత, అనురాగం, ప్రేమ నాకు చాలా ముచ్చటగా అనిపించింది.

Comments

Popular posts from this blog

**ప్రకృతి ప్రేమికులు**